Logo

శ్రీ అద్వయానందభారతీ స్వామి
(పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు)
సాహితీ ప్రస్థానం

అవిచ్ఛిన్న ఆర్ష సంప్రదాయార్థిగా, శ్రీవిద్యా చక్రవర్తిగా, బ్రహ్మనిష్ఠుడుగా, కవీశ్వరలోక శిరః ప్రసూనముగా, కవియోగిగా,నవ్యమిథిలానివాసిగా, అబ్జసూతిరమణీ రమణీయ మహఃప్రియాకృతిగా కవి పండితుల చేత ప్రశంసలందుకున్న కవీశ్వరుడు, ఆర్షవిద్యా వాచస్పతి, శ్రీవిద్యారత్నాకర, సర్వతంత్ర స్వతంత్ర బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. ఈనాడు తెలుగు సాహిత్యంలో “కవీనాం కవితైవయోగః” అన్న క్షేమేంద్రుని అభియుక్తికి తార్కాణంగా నిలచిన వారు రావు గారు. శ్రీ శృంగేరీ శారదా పీఠ పూర్వ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారి అనుగ్రహంవలన, భక్తేప్సిత కల్పవల్లరియగు జగదంబ కృపవలన, రావుగారు ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో అనేక గ్రంథాలను రచించి విద్వజ్జనుల మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగించారు. సహజంగా ఉన్న బహుముఖ ప్రజ్ఞ, స్వయంకృషి వలన సాధించిన మంత్ర, దార్శనికాది బహు శాస్త్ర పాండిత్యము రావుగారి రచనలలో సాహిత్యస్ఫురన్మాధుర్యాన్ని పొందాయి. నవలారచయితగా,మంత్రశాస్త్ర చరణుడుగా, సంస్కృతవిద్వాంసుడుగా, కవితా విమర్శకుడుగా, వ్యాఖ్యాతగా, కవిగా రామలింగేశ్వరరావుగారు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
తన చిన్నతనంలోనే రావుగారికి దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి చరణుల అనుగ్రహం వలన శ్రీవిద్యయందు పాదుకాంతదీక్ష లభించి చిద్విద్యాదీపిత స్వస్వరూపాభిజ్ఞులయ్యారు. శ్రీ జగద్గురు చరణుల సన్నిధిలో బ్రహ్మవిద్యయందు, శ్రీవిద్యయందు అధీతి బోధాచరణములను శిష్ఠాచారక్రమంలో ఆచరించి రావుగారు గార్హస్ధ్యంలో కృతకృత్యులయ్యారు. యదృఛ్ఛాలాభ సంతుష్టులై అనేక లౌకికవిషయాలను త్యాగంచేసి 1961 నుండి మద్రాసులో స్థిరపడి తపోజీవనాన్ని కొనసాగించారు.
రామలింగేశ్వరరావుగారు రచించిన పద్యకావ్యాలు- శివానుగ్రహము పితృయజ్ఞము, ప్రేయోనువాకము, గోదావరిగర్భము, అగ్నిష్టోమము, హాస్య గాథా ద్విశతి. రావు గారి కావ్యం ‘శివానుగ్రహము’ నవ్య ధూర్జటీకమని శ్రీ వేలూరి, శ్రీ విశ్వనాథ వంటి కవితామర్మజ్ఞులు, "మీ శబ్దాధికారము, శాస్త్రపరిచయం ఉత్తమ శ్రేణివి" అని శ్రీకాటూరి ప్రశంసించారు. 'పితృయజ్ఞము'అనే స్మృతికావ్యం ఆంధ్రసాహిత్యంలోని స్మృతికావ్యాలలో ప్రధమగణ్యమని విమర్శకులంగీకరించారు.
రామలింగేశ్వరరావుగారి ప్రవృత్తి శాంతరస ప్రధానం కావటంవలన, ఆయన శాంతరసాన్ని అంగిగా గ్రహించి శిల్పసముజ్వలంగా నవలలను రచించారు. వీరి రచనలలో ఆద్యంతం ధార్మికసౌరభం గుబాళిస్తూ ఉంటుంది. రస, పాత్ర పోషణలోనూ, సన్నివేశ కల్పనలోనూ, సదాచార ప్రదర్శనలోనూ, మనస్తత్వ ప్రకటనలోనూ, లలితమధుర పదప్రయోగంలోనూ, కథాకథనశిల్పంలోనూ రామలింగేశ్వర రావుగారి నైపుణ్యం శ్లాఘనీయమైనది.
రావుగారి నవలలు - ధర్మనిర్ణయం, తిక్కన సోమయాజి, శ్రీ పోతనామాత్యులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, మనకుమిగిలింది, మీనాక్షి పెళ్లిచేసుకుంది మొదలైనవి. ఇవి విశ్వసాహిత్యానికే అలంకారాలని విమర్శకుల అభిప్రాయం. ధర్మనిర్ణయం నవల విశ్వసాహిత్య హారంలో మేలి రత్నమని శ్రీ విశ్వనాథ వారు, పింగళి లక్ష్మీకాంతంగారు వంటి ప్రముఖులు కీర్తించారు. "ధర్మనిర్ణయం నవల చదువుతున్నంతసేపు నేను విగళిత వేద్యాంతరమైన బ్రహ్మానందస్థితిలో ఉండిపోయాను" అని దివాకర్ల వేంకటావధానిగారు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 'తెలుగు నవల' అనే పేరుతో ప్రకటించిన పుస్తకంలో "తెలుగు భాషలో ఉత్తమోత్తమమైన పది నవలలు లెక్కించి చెప్పవలసి వస్తే తప్పక చేరవలసిన నవల ధర్మనిర్ణయం" అని పేర్కొన్నారు. ‘తిక్కనసోమయాజి’ ఐతిహాసిక నవల. దీనిని గూర్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ "నిస్సంశయముగానిది గుణసంపూర్ణమైన మహారచన" అని పింగళి లక్ష్మీకాంతం గారు, "ఆంధ్ర ఐతిహాసిక నవలాలోక శిరోభూషణమైన మహారచన. ఈ నవలను సకల విద్యా రహస్య వేత్త అయిన రావుగారు తప్ప మరెవ్వరూ వ్రాయలేరు" అని విశ్వనాథవారు, "ఆర్షసంప్రదాయములను, యోగవిద్యారహస్యములను, పవిత్ర భారతీయ సంస్కృతిని, మంత్రశాస్త్రాదుల మహిమను సూచించు నవలలు వ్రాయగలిగిన వారు రావుగారొక్కరే" అని దివాకర్ల వేంకటావధాని గారు ప్రశంసించారు. విద్వాన్ శ్రీభాగవతుల కుటుంబరావు గారు ‘తాళ్లపాక అన్నమాచార్యులు’ నవలను గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ "మధురమైన భక్తి, ధర్మము అనే భావములను సరస హృద్య రచనావిధానమనే తేనెలో పొదిపి పాఠకులకందించారు. రచన చదువుతున్నంతసేపు మనము దేవతా సన్నిధిలో సంచరిస్తున్నట్లుగా, మహాకవుల సమాజంలో మెలగుతున్నట్లుగా, ధర్మ ప్రభువుల పాలనలో ఉన్నట్లుగా, దివ్య మధురానుభూతులు మనకు కలిగి తీరుతాయి. ఆ అనుభవాన్ని కలిగించే శక్తి శ్రీ రావుగారి ఈ రచనలో, వారి కథాకథనవిధానములో, పాత్రపోషణ ఔచిత్యంలో కనబడుతుంది" అని వివరించారు.
సాహిత్య విమర్శలలో్ రామలింగేశ్వర రావుగారిదొక ప్రత్యేక ప్రస్థానం. ఆయన విమర్శనాదృష్టి అపూర్వమైనది, అద్వితీయమైనది. పోతన్నగారి సహజపాండిత్యము, నన్నెచోడుని వస్తుకవిత, ధూర్జటి అతులిత మాధురీమహిమ, విశ్వనాథ శ్రీమంజూషిక, సాహిత్యంలో నేటి స్థితిగతులు వంటి సాహిత్య విమర్శ గ్రంథాలు ఆయనకు ఆంధ్ర సాహిత్య విమర్శక లోకంలో అగ్రేసరత్వాన్ని కల్పించాయి. 'పోతన్నగారి సహజ పాండిత్యము' అనే గ్రంథాన్ని గురించి వ్రాస్తూ “కవులును, భావుకులును, పండితులును తప్పక చదువవలసిన గ్రంథము”అని విశ్వనాథవారు, “ఇట్టి గ్రంథము ఇదివరకు పుట్టలేదు. దానియోగ్యత వర్ణనాతీతముగానున్నది”అని కాశీ కృష్ణాచార్యులుగారు, “నాకు తెలియని విషయములెన్నో గ్రహించాను” అనిపింగళివారు, “పోతన గారి పాండితీ వైభవమును చూపినప్పుడు రావుగారు స్మృతి, శ్రుతి పురాణముల నుండియు, ఉపనిషత్తులనుండియు, బ్రహ్మసూత్రములనుండియు, మంత్రశాస్త్ర గ్రంథముల నుండియునుద్ధరించిన భాగములు వారి సహజ పాండిత్యమును గూడా చాటుచున్నవి”అని దివాకర్లవారు ప్రశంసించారు.
రామలింగేశ్వరరావుగారు శ్రీవిద్యాతత్వ రహస్యాలు తెలిసినవారు మాత్రమేకాక మీమాంసాది శాస్త్ర విషయాలలో కూడా కూలంకష ప్రజ్ఞ కలవారు. ఆర్ష విద్యావాచస్పతులైన వీరు సాహిత్యసాగరాన్ని ఆపోశనంపట్టిన అపరకుంభసంభవులని ఆయనవ్రాసిన సాహిత్యవిమర్శలు, నవలలు నిరూపిస్తున్నాయి. రావుగారి మంత్రశాస్త్ర గ్రంథాలు - శ్రీచక్రవిలసము, శ్రీచక్ర పూజావిధానము, సౌందర్యలహరీ వ్యాఖ్యానము, లలితా సహస్రనామ వ్యాఖ్యానము, లలితా త్రిశతీ వ్యాఖ్యానము, ముత్తుస్వామి దీక్షితుల నవావరణకీర్తనల వ్యాఖ్యానము, శ్రీమత్త్రిపురసుందరీ వేదపాదస్తోత్ర వ్యాఖ్యానము. “శ్రీ రావు గారి ఆగమపాండిత్యము, సాహిత్యకౌశలము, ఆలంకారికశాస్త్ర పారావారపారీణత, శబ్దాధికారము, మౌళికస్థానీయములై యీ వ్యాఖ్యాన గ్రంథమును ప్రత్యక్షర రమణీయముగా, ప్రత్యక్షర ప్రమాణ కలితముగా చేసినవి”అని చెఱకుపల్లి జమదగ్ని శర్మగారు సౌందర్యలహరి వ్యాఖ్యాన గ్రంథాన్ని గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 'శ్రీచక్రవిలసనం' గ్రంథాన్ని గురించి విశ్వనాథవారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ “ఈయన నా కవితాభిమాని. అచ్చట నాతో స్నేహం. నేనును కొన్ని శ్రీవిద్యా గ్రంథములను చదివితిని. చదువుట వలన విషయములు తెలియును గాని రహస్యములు తెలియవు. ఈయన రహస్యములు తెలిసినవాడు. వయసులో నాకంటే చాల చిన్నవాడు. కవితా విషయమున నాకు శిష్యుడననును. నేను ఆయనకు నమస్కారమెట్లు చేయుదును?” అని వ్రాసారు. వేలూరి శివరామ శాస్త్రిగారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ “మీకు ఆశీర్వచనాలతో వ్రాద్దామనుకున్నానుగాని మీ శ్రీవిద్యాచక్రవర్తిత్వాన్ని వెల్లడిస్తున్న మీ శ్రీచక్రవిలసనము చూసిన తరువాత మిమ్మల్ని ఆశీర్వదించగల యోగ్యత నాకున్నదని నేననుకోవడం లేదు”అని పేర్కొన్నారు.“శ్రీ రామలింగేశ్వరరావుగారి శ్రీచక్రవిలసనము, తదితర సాహిత్య మంత్ర, దార్శనిక గ్రంథములను గూర్చికాని, వారి బహుముఖ పాండిత్యమునుగూర్చి కాని, యోగ వేత్తృత్వమును గూర్చి కాని చెప్పు యోగ్యత కించిజ్ఞుడనైన నాకు లేదు"అని అక్కిరాజు రమాపతిరావుగారు తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.
1974వ సంవత్సరంలో తుమ్మలపల్లి వారికి మద్రాసులో ఘనంగా సన్మానం చేసి, ఆ సభలో రావుగారి రచనలను గురించి అనేకమంది సాహిత్య ప్రముఖులు వ్రాసిన విమర్శలను ఒక సంచికలో పొందుపరిచి ‘రామలింగేశ్వరరావు అభినందన గ్రంథము’ అనే పేరుతో సన్మాన సభలో ప్రకటించారు. 1979వ సంవత్సరంలో మద్రాసు నగరంలోని కళాభారతి సంఘం వారు కవులను, పండితులను అభినందించేందుకు ఏర్పరిచిన విద్వత్సభలో ప్రముఖ సాహితీవేత్తలతోపాటు రామలింగేశ్వర రావుగారిని కూడా సత్కరించారు. 1980 వ సంవత్సరంలో మద్రాసులోని యార్లగడ్డ రాజ్యలక్ష్మి శ్రీ వెంకన్న చౌదరి కళాపీఠం వారు మన సంస్కృతి, జీవన రంగాలను సుసంపన్నం చేసిన పది మంది మహనీయులతోపాటు రావుగారికి కూడా సన్మానం చేసారు. రావుగారు రచించిన వచనసాహిత్య గ్రంథాలు - పోతన్నగారి భాగవతవచనము, శ్రీశంకరాచార్య విజయము. ఆయన రచించిన సాహిత్యవ్యాఖ్యానాలు - నారాయణీయ వ్యాఖ్యానము, సీతారామాంజనేయ సంవాద వ్యాఖ్యానము. రావుగారి వేదాంత వ్యాఖ్యానాలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి దక్షిణామూర్తి స్తోత్రవ్యాఖ్యానము, ఆత్మ బోధ వ్యాఖ్యానము, అపరోక్షానుభూతి వ్యాఖ్యానము, వేదాంతడిండిమ వ్యాఖ్యానము, శతశ్లోకీ వ్యాఖ్యానము, దశశ్లోకీ వ్యాఖ్యానము, ఏకశ్లోకీ వ్యాఖ్యానము. ఇవికాక మంత్రపుష్ప వ్యాఖ్యానము, పంచసూక్త వ్యాఖ్యానము, ఆదిత్యహృదయ వ్యాఖ్యానము, కేశవాది చతుర్వింశతినామ వ్యాఖ్యానము మొదలైన వైదికగ్రంథ వ్యాఖ్యానాలనుకూడా రచించారు.
రామలింగేశ్వరరావు గారు వ్రాసిన దార్శనిక గ్రంథాలు – మనమూ మనమతము, భారతీయ దర్శన ప్రపంచము, వేదాంత న్యాయములు, జీవన్ముక్తుడు, వేదాంత శాస్త్రం తెలుసుకోవాలంటే, జీవేశ్వరులు, బ్రహ్మ విద్యకు ప్రతిబంధకములు, శబ్ద నిత్యత్వ వాదము. 'భారతీయ దర్శన ప్రపంచం'ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా వెలువడింది. రావుగారి వ్యాసావళి – 'మన భూగర్భ జలసంపద' 'మన కరువులు నివారణ చర్యలు'. వీటిని ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. రావుగారు వ్రాసిన చిన్న కథలనేకం. వీటిని ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, చందమామ, బాలానందం, బాలమిత్ర, శంకర కృపలలో ధారావాహికంగా ప్రచురించారు.
ఆంగ్ల భాషా పాటవం కలిగిన ఈ ప్రతిభావంతుడు యాత్రావృత్తాంతాలుగా వ్రాసిన Sringeri Revisited, A Profile of Kalady మొదలైన గ్రంథాలలో కవితాత్మకమైన శయ్యాసౌభాగ్యం ప్రస్ఫుటంగా కనుపిస్తుంది. ఇవి గద్యంలోవ్రాసిన కవిత్వమే అనుకునేంత భవ్య కవితావేశంతో చేసిన రచనలు. వీటిలో దార్శనిక దృష్టి, సర్వమానవ సమైక్య దృష్టి, మార్మికత ద్యోతక మవుతాయి. ఇవి కాకుండా రావుగారు ఆంగ్ల భాషలో వ్రాసిన ఇతర గ్రంథాలు- Sureswaracharya, Rationale of Mantra Sastra, Our Sannidhanam ఆయన మేధా సంపత్తికి దర్పణాలు.
రామలింగేశ్వరరావుగారి అనువాద గ్రంథాలు – బ్రహ్మవిద్యా వ్యాఖ్యాన సింహాసనము, కాలడి, మళ్లీ చూచిన శృంగేరి, శ్రీ చంద్రశేఖర భారతీస్వామివారితో సంభాషణలు, శివగంగ మఠము, కంచిలో కామాక్షీదేవి, శ్రీ శృంగేరీ సంయమీంద్రులు, శ్రీ రాజేంద్రప్రసాదు శృంగేరీయాత్ర.
సంగీతజగద్గురు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మొదలైన రచనలు రావు గారికి సంగీతం పట్ల ఉన్న మక్కువకు నిదర్శనాలు. రావు గారి ఇతర రచనలు నిత్యకర్మలు, యోగాసనములు, అరుణ ఆంగ్లభాషా స్వబోధిని, పెద్దబాలశిక్ష, మన సన్నిధానంవారు.
శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్థ మహాస్వామి, శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వార్ల ఆనతి మేరకు శ్రీ శృంగేరీ శారదా పీఠం వారి యాజమాన్యంలో వెలువడే “శ్రీ శంకర కృప” ఆధ్యాత్మిక మాసపత్రికకు రావుగారు దాదాపు రెండు దశాబ్దాల పాటు సంపాదకుడుగా వ్యవహరించారు. రావుగారి సతీమణి స్వర్గస్థురాలయిన తరువాత తమ ఇష్టానుసారంగా 1988 వ సంవత్సరంలో శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీమదభినవ విద్యా తీర్థ మహాస్వాములవారి సన్నిధిలో సన్యాసాశ్రమ స్వీకారం చేసి ‘అద్వయానందభారతి’ యోగ పట్టాన్ని పొంది, ఆ నామంతో ప్రకాశించారు. సన్యాసాశ్రమ స్వీకారానంతరం కూడ స్వామివారు అనేక గ్రంథరచనలు చేసారు. శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు అద్వయానందభారతీ స్వామివారి శ్రీలలితాత్రిశతీనామ భాష్యానువాదమనే గ్రంథాన్ని గురించి వ్రాస్తూ “శ్రీ అద్వయానందభారతీ స్వామివారు శ్రీ విద్యా సంప్రదాయములను చక్కగా నెరిగినవారు కావున వారి అనువాదము నిర్దుష్టముగనున్నది. భాష్యమునకన్యూనానతిరిక్తమగు ఈ యనువాదము భాష్యార్థ జిజ్ఞాసువులకు మిక్కిలి యుపయోగపడగలదు”అని అభిప్రాయపడినారు. రావుగారి ‘శ్రీలలితా సహస్రనామస్తోత్ర భాష్యము’ గ్రంథానికి శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తమ శ్రీముఖములో “లలితా సహస్ర నామములకు సౌభాగ్య భాస్కరాను సారము ఆంధ్ర వ్యాఖ్యను వ్రాసిరి. దీని యందు వ్యాఖ్యాంతరములందలి విశేషములు గూడా చేర్చబడియున్నవి. దీనిని మేమవలోకించినాము. ఇది అత్యంతోపాదేయముగానున్నది”అని ప్రశంసించారు. కుర్తాళం లోని సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు తమ ఆశీస్సులనందజేస్తూ “తుమ్మలపల్లివారి రచన అనన్యము. అనుపమాన విశిష్టతా శోభితము. ఎన్నోచోట్ల నామములకు వారు చెప్పిన అర్థములు ప్రామాణికములు. రసరూపిణి అయిన లలితాదేవిని భావించిన రచయిత నిజమైన ప్రమాత. లలితా మోదినియన్న ఈ వ్యాఖ్య బహుళార్థ సమన్వితమై ఆనంద సురభిళమై ప్రకాశించుచు రామలింగేశ్వర రావుగారికి శాశ్వతమైన కీర్తిని భూమిపై నిలపగలదు”అని ఆశీర్వదించారు. అద్వయానంద భారతీ స్వామివారు తమ ప్రథమ చాతుర్మాస్య వ్రత దీక్షను నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో పాటించిన సందర్భంలో స్వామివారి శిష్యులందరూ కలసి శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్టు తరపున స్వామివారి రచనలను గురించి ప్రముఖులు వ్రాసిన వ్యాసాలను ఒక సంచికగా ప్రకటించారు. స్వామివారి ప్రథమ చాతుర్మాస్య దీక్షా విసర్జనోత్సవము నాడు శ్రీ అద్వయానందభారతీ స్వామివారి పాద పద్మాలకు ప్రణామాలతో ఆ సంచికను ప్రస్తుతిమాలగా సమర్పించారు.
శ్రీస్వామివారు మల్కాజిగిరిలోని ఆనందబాగ్ లోనున్న ‘శ్రీ అద్వయానంద తపోవనం’లో నివసించే రోజులలో, కాలవశాన 1991 వ సంవత్సరం దుర్గాష్టమినాడు శ్రీస్వామివారు సిద్ధి పొందారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆయన భౌతికకాయాన్ని పవిత్రమైన కృష్ణానదీ జలాలలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపాన జలసమాధి చేసారు.
భారతీయ జీవనపు విలువలను ధార్మిక రహస్యాలతో మేళవించి, బంధపారుష్య రహితమైన శైలితో, శబ్ద కాఠిన్యవర్జితమయిన వైదర్భీరీతికి ఉత్తమ ఉదాహరణంగా, మాధుర్యప్రసాదగుణరాశిగా ఉత్తమసాహిత్యాన్ని సృజించిన సాహిత్య కళా తపస్సిద్ధులు శ్రీ అద్వయానందభారతీ స్వామివారు.

బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు
(తురీయాశ్రమంలో పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ అద్వయానంద భారతీ స్వామి)
వ్రాసిన గ్రంథములు

Click on the cards to get more titles

కవిత

శివానుగ్రహము పితృయజ్ఞము
హాస్యగాథాద్విశతి
ప్రేయోనువాకము
గోదావరీ గర్భము
అగ్నిష్టోమము
(పత్రికలలో కూడ ప్రకటింపబడిన ఖండికల సంపుటి)
చింతామణిద్విశతి
(అముద్రితము)
ఊర్మిళాసౌమిత్రము
(అముద్రిత కావ్యము)

నవలలు

ధర్మనిర్ణయం
(సాంఘిక నవల)
తిక్కనసోమయాజి
(ఐతిహాసిక నవల)
శ్రీ పోతనామాత్యులు
(ఐతిహాసిక నవల)
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు
(ఐతిహాసిక నవల)
మనకు మిగిలింది
(సాంఘిక నవల)
మీనాక్షి పెళ్లిచేసుకుంది
(సాంఘిక నవల)
మా నాన్నకు అల్లుడు
(సాంఘిక నవల)
కొల్లం ఆండు
(శ్రీ శంకరభగవత్పాదుల కాలము నాటి చారిత్రక నవలిక)
సుబ్బయ్య కొడుకులు
(సాంఘిక నవల)
ఇది ఎప్పుడూ ఇంతే
(సాంఘిక నవల)

సాహిత్య విమర్శ

పోతన్నగారి సహజపాండిత్యము
నన్నిచోడుని వస్తుకవిత
ధూర్జటి అతులిత మాధురీమహిమ
విశ్వనాథ శ్రీ మంజూషిక
సాహిత్యంలో నేటి స్థితిగతులు
(పత్రికలలో ధారావాహికంగా ప్రకటింప బడింది)
శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు సాహిత్య విమర్శలు

మంత్రశాస్త్ర గ్రంథములు

శ్రీచక్రవిలసనము
శ్రీచక్రపూజావిధానము
సౌదర్యలహరీ వ్యాఖ్యానము
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర భాష్యము
శ్రీ లలితా త్రిశతీ నామ భాష్యానువాదము
ముత్తుస్వామి దీక్షితుల నవావరణ కీర్తనల వ్యాఖ్యానము
శ్రీమత్త్రిపురసుందరీ వేదపాదస్తోత్ర వ్యాఖ్యానము

సాహిత్య వ్యాఖ్యానములు

నారాయణీయ వ్యాఖ్యానము
సీతారామాంజనేయ సంవాద వ్యాఖ్యానము

వచన సాహిత్యము

పోతన్నగారి భాగవత వచనము (అముద్రితము)
శ్రీ శంకరాచార్య విజయము

వేదాంత వ్యాఖ్యానములు

దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానము
స్తోత్ర కదంబము
ఆత్మబోధ వ్యాఖ్యానము
అపరోక్షానుభూతి వ్యాఖ్యానము
వేదాంతడిండిమ వ్యాఖ్యానము
శతశ్లోకీ వ్యాఖ్యానము
దశశ్లోకీ వ్యాఖ్యానము
ఏకశ్లోకీ వ్యాఖ్యానము
హరిమీడేస్తుతి వ్యాఖ్యానము

వైదిక గ్రంథ వ్యాఖ్యానములు

మంత్రపుష్పము
పంచసూక్త - మన్యుసూక్తములు
ఆదిత్యహృదయము
కేశవాది చతుర్వింశతినామ వ్యాఖ్యానము
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రము
మోహముద్గరః
శ్రీ లలితా సహస్రనామ స్త్రోత్రము
శ్రీ కనకధారా స్త్రోత్రము

దార్శనిక గ్రంథములు

మనమూ మనమతము
భారతీయ దర్శన ప్రపంచం
(ఆంధ్రపత్రికలో వెలువడింది)
వేదాంత న్యాయములు
జీవన్ముక్తుడు
వేదాంతశాస్త్రం తెలుసుకోవాలంటే
జీవేశ్వరులు
బ్రహ్మవిద్యకు ప్రతిబంధకములు
శబ్ద నిత్యత్వ వాదము

వ్యాసావళి

మన భూగర్భ జలసంపద
(ఆంధ్ర పత్రికలో ధారావాహికం)
మన కరవులు నివారణ చర్యలు
(ఆంధ్ర పత్రికలో ధారావాహికం)

అనువాద గ్రంథములు

బ్రహ్మవిద్యా వ్యాఖ్యాన సింహాసనము
కాలడి
మళ్లీ చూచిన శృంగేరి
శ్ర చంద్రశేఖర భారతీ స్వామివారితో సంభాషణలు
శ్రీ శృంగేరీ సంయమీంద్రులు
రాజేంద్ర ప్రసాదు శృంగేరీ యాత్ర
శివగంగ మఠము
కంచిలో కామాక్షీదేవి

సంగీతము

సంగీత జగద్గురు త్యాగరాజు
ముత్తుస్వామి దీక్షితులు
శ్యామ శాస్త్రి

చిన్న కథలు

అభిమానం
పిల్లలకు కథలు
కిటుకుల క్రిష్ణయ్య
శ్రీ శంకర విజయ గాథ

ఇతరములు

నిత్యకర్మలు
యోగాసనములు
అరుణా ఆంగ్లభాషా స్వబోధిని
మన సన్నిధానము వారు

ఆంగ్ల గ్రంథములు

Sringeri Revisited
Sureswaracharya
A Profile of Kalady
Rationale of Mantrasastra
Our Sannidhanam

Some of the books authored by Sri Tummalapalli Ramalingeswara Rao garu / Sri Adwayananda Bharati Swami are available for sale at the following centres:

  • Sahitya Niketan, 3-4-852, Kesava Nilayam, Barkatpura, Hyderabad - 500027
  • SABS Trust, G-305 Brigade Metropolis, Whitefield Main Road, Mahadevapura, Bangalore - 560048
  • Sri Seetharama Adisankara Trust, 24-141, Anand Bagh, Malkajgiri, Hyderabad – 500047
  • Sri Sringeri Sanakara Mutt, University Road, Nallakunta, Hyderabad – 500044
  • Sri Adwayananda Bharati Swami Trust,205 Sai Durga Nilayam, Street 14, Lane 1, Tarnaka,Secunderabad – 500017
  • Giri Trading Agency Pvt. Ltd., Padmarao Nagar, Skandagiri, Secunderabad
  • Sri Raghavendra Book Centre, 2/1 Brodipet, Guntur – 522002
  • Balasaraswati Book Depot, 7, Sunkurama Chetty Street, Chennai – 600001
  • Giri Trading Agency Pvt. Ltd., Near Ayodhya Mandapam, West Mambalam, Chennai - 600033
  • Sri Sri Sri Jagadguru Sankaracharya Mahasamsthanam, Dakshinamnaya Sri Sarada Peetham, Sringeri – 577139 Karnataka
  • Sri Sai Ganesh Book Store, Opp. Hanuman Temple, Ramakrishnapuram, Kothapeta, Hyderabad 500035
  • Mohan Publications (Devullu.com), Near Ajantha Hotel, Kotagummam, Rajamahendravaram 533101
  • Exotic India Art Pvt.Ltd., A-16/1, Wazirpur Industrial Area, Delhi 110052
  • Amazon.in webstore:Search for tummalapalli ramalingeswara rao.



The following books are available in digital form from the Internet Archives:

  1. Dharmanirnayam (Social novel) – Digital library of India Item 2015.497304; Publication date 1970
    https://archive.org/details/in.ernet.dli.2015.497304/mode/2up

  2. Tikkana Somayaji (Historical novel) (Total 335 p: last 11 p not shown)- Digital library of India Item 2015.497668; Publication date 1969
    https://archive.org/details/in.ernet.dli.2015.497668

  3. Sri Sureswaracharya (Biography) - Digital library of India; Publication date 1970
    https://archive.org/details/acc.no.4798srisureswaraacharya1970/page/n13/mode/2up

  4. Sringeri Revisited (Musings in Philosophy and Mysticism) Digital library of India
    https://archive.org/details/nWBu_shringeri-revisited-by-t.-ramalingeshvar-rao-sharada-peeth-shringeri/page/n105/mode/2up

Back to
Home Page