Logo

శ్రీ అద్వయానందభారతీ స్వామి
(పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు)
జీవన రేఖలు

తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి జన్మస్థలం గుడివాడ. 1921 వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ తేదీన ఆయన శ్రీ జ్వాలాపతి, శ్రీమతి మహాలక్ష్మమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా, ప్రథమ పుత్రుడిగా జన్మించారు. రామలింగేశ్వరరావు తండ్రి గారైన జ్వాలాపతి గారు గుడివాడ రైల్వేస్టేషన్ సమీపాన ఎఱుకపాడులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వయంగా సంవత్సరకాలం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితంగా రావు గారు జన్మించడం వలన వీరికి రామలింగేశ్వరరావు అని నామకరణం చేశారు.

తుమ్మలపల్లి వారి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం గుడివాడలో జరిగింది. తరువాత రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ నుంచి విజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కళాశాల చదువు పూర్తయిన తరువాత రావుగారు కొంతకాలంపాటు బెంగళూరులో ఉద్యోగం చేసారు. తన ఇరవై ఒకటవ ఏట, 1942 వ సంవత్సరంలో రామలింగేశ్వరరావు గారికి తేలప్రోలు వాస్తవ్యులు శ్రీ గుడిపాటి వెంకట గోపాలకృష్ణ శర్మ పాకయాజి, శ్రీమతి సీతారామమ్మ దంపతుల జ్యేష్ట పుత్రిక విశాలాక్షి గారితో వివాహం జరిగింది. రామలింగేశ్వర రావు, విశాలాక్షి దంపతులకు ముగ్గురు కుమార్తెలు - ఉమాదేవి, జానకీ దేవి, లక్ష్మీ సావిత్రి. ఒకే కుమారుడు - జ్వాలా ప్రకాశ విద్యాపతి. వివాహం జరిగిన కొంతకాలానికే రావుగారి తండ్రిగారు గతించడంతో కుటుంబ బాధ్యతలన్నీ రావుగారు స్వీకరించవలసి వచ్చింది. రామలింగేశ్వరరావు గారు 1942 వ సంవత్సరం నుంచి 1951 వరకు తాడేపల్లిగూడెం, ఏలూరు, దేవరపల్లి, చింతలపూడి, నర్సాపురం ప్రాంతాలలో ఎకౌంటెంట్ గాను, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గానూ ప్రభుత్వ రంగంలో పని చేసారు. రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.జి.ఓ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా వుండే రోజుల్లో ఉద్యోగ పరమైన చిక్కులను ఎదుర్కొని తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత, 1951 నుంచి 1956 వరకు కడపలో వున్న“కడప స్టార్ బెరైట్స్ లిమిటెడ్” అనే సంస్థలో మేనేజర్ గానూ, 1956 నుంచి 196౦ వరకు “రావ్ అండ్ కంపెనీ” అనే సంస్థను ఏర్పరచి దానికి ప్రొప్రయిటర్ గాను వ్యవహరించారు. చివరికి ఆ వృత్తిని కూడా త్యజించి, యదృఛ్ఛాలాభ సంతుష్టులై అనేక లౌకికవిషయాలను త్యాగంచేసి 1961 నుండి మద్రాసులో స్థిరపడి తపోజీవనాన్ని కొనసాగిస్తూ సాహితీ రంగంలో విశేషమైన కృషి చేయడం ఆరంభించారు. రచనలు చేయటమే ధ్యేయంగా పెట్టుకోవటంతొ అనేక ఆర్థిక ఇబ్బందులను కూడ రావుగారు ఎదుర్కోవలసి వచ్చింది.
1986 వ సంవత్సరంలో రావుగారు తమ సతీమణి శ్రీమతి విశాలాక్షి స్వర్గస్థురాలయిన తరువాత తమ ఇష్టానుసారంగా 1988 వ సంవత్సరంలో శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వాములవారి సన్నిధిలో సన్యాసాశ్రమ స్వీకారం చేసి ‘అద్వయానందభారతి’ యోగపట్టాన్ని పొంది, ఆ నామంతో ప్రకాశించారు. సన్యాసాశ్రమ స్వీకారానంతరం కూడ స్వామివారు అనేక గ్రంథరచనలు చేసారు.
శ్రీస్వామివారు కొంతకాలం శృంగేరీలోను, హైదరాబాదు – నల్లకుంటలోనున్న శంకర మఠంలోను, ఆ తర్వాత మల్కాజిగిరిలోని ఆనందబాగ్ లోనున్న ‘శ్రీ అద్వయానంద తపోవనం’ లోను నివసించారు.
కాలవశాన 1991 వ సంవత్సరం దుర్గాష్టమినాడు (16 అక్టోబరు) శ్రీ స్వామివారు సిద్ధిపొందారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆయన భౌతికకాయాన్ని పవిత్రమైన కృష్ణానదీ జలాలలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపాన జలసమాధి చేయటం జరిగింది.

Back to
Home Page